దేశమును ప్రేమించుమన్నా….. గుఱజాడ

అక్టోబర్ 20, 2007

                దేశభక్తి

దేశమును ప్రేమించుమన్నా,

మంచి అన్నది పెంచుమన్నా

ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్,

గట్టి మేల్ తల పెట్టవోయ్

.

పాడి పంటలు పొంగి పొర్లే

దారిలో నువు పాటుపడవోయ్ ;

తిండి కలిగితే కండ కలదోయ్!

కండకల వాడేను మనిషోయ్!

.

ఈసురోమని మనుషులుంటే

దేశమేగతి బాగుపడునోయ్?

జల్దుకొని కళలెల్ల నేర్చుకు

దేశి సరుకులు నించవోయ్

అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్,

దేశి సరకుల నమ్మవలెనోయ్!

డబ్బు తేలేనట్టి నరులకు

కీర్తి సంపద లబ్బవోయ్

వెనుక చూసిన కార్యమేమోయ్?

మంచి గతమున కొంచెమేనోయ్

మందగించక ముందు అడుగేయ్

వెనుక పడితే వెనకేనోయ్

పూను స్పర్ధలు విద్యలందే

వైరములు వాణిజ్యమందే

వ్యర్ధ కలహం పెంచబోకోయ్

కత్తి వైరం కాల్చవోయ్

.

దేశాభిమానం నాకు కద్దని

ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్;

పూని ఏదైనా ఒకమేల్

కూర్చి జనులకు చూపవోయ్!

.

ఓర్వలేమి పిశాచి దేశం

మూలుగులు పీల్చేసెనోయ్,

ఒరుల మేలుకు సంతసిస్తూ

ఐకమత్యం నేర్చవోయ్!

.

పరుల కలిమికి పొర్లియేడ్చే

పాపి కెక్కడ సుఖం కద్దోయ్?

ఒకరి మేల్ తనమేల నెంచే

నేర్పరికి మేల్ కొల్లలోయ్!

.

స్వంత లాభం కొంత మానుకు

పొరుగు వాడికి తోడుపడవోయ్

దేశమంటే మట్టి కాదోయ్,

దేశమంటే మనుషులోయ్!

.

చెట్ట పట్టాల్ పట్టుకొని

దేశస్ధులంతా నడువవలెనోయ్!

అన్నదమ్ముల వలెను జాతులు

మతములన్నీ మెలగవెనోయ్

మతం వేరైతేను యేమోయ్?

మనసులొకటై మనుషులుంటే

జాతి అన్నది లేచి పెరిగి

లోకమున రాణించునోయ్!

.

దేశమనెడి దొడ్డ వృక్షం

ప్రేమలను పూలెత్తవలెనోయ్,   

నరుల చెమటను తడిసి మూలం

ధనం పంటలు పండవలెనోయ్!

.

ఆకులందున అణగిమణగీ

కవిత కోయిల పలుక వలెనోయ్

పలుకులను విని దేశమందభి

మానములు మొలకెత్తవలెనోయ్!

                         మహాకవి గుఱజాడ వెంకట అప్పారావు గారు.


నను బ్రోవుమని ….

అక్టోబర్ 15, 2007

                         భద్రాచల శ్రీరామ దాస కృతి

                         రాగము కళ్యాణి  ఆది తాళము

నను బ్రోవుమని చెప్పవే  సీతమ్మ తల్లీ!

నను బ్రోవుమని చెప్పు నారీ శిరోమణి-

జనకుని కూఁతురా! జననీ జానకమ్మ\\                   \\నను\\

ప్రక్కనుజేర్చుక – చెక్కిలి నొక్కుచుఁ

జక్కగ మరుకేళి సొక్కియుండెడి వేళ \\                      \\నను\\  

ఆద్రిజావినుతుఁడు – భద్రగిరీశుఁడు

నిద్రమేల్కొను వేళ – నెలఁతరో బోధించి \\                       \\ నను \\


చరణములే నమ్మితి…..

అక్టోబర్ 11, 2007

                         శ్రీ రామ దాస కృతి

                      రాగము కాపీ; ఆది తాళము

చరణములే నమ్మితి  నీ దివ్య  చరణములే నమ్మితి

వారధి గట్టిన  వర భద్రాచల వరదా వరదా నీ దివ్య \\

 ఆది శేష నన్నఱమర సేయకు

మయ్యా అయ్యా అయ్యా నీ దివ్య \\         //చరణ//

వనమున ఱాతిని వనితగ జేసిన

చరణము శరణము నీ దివ్య \\               //చరణ//

బాగుగ నన్నేలు  భద్రాచల రామ

దాసుఁడ దాసుఁడ దాసుఁడ నీ దివ్య \\      //చరణ//


చెప్పగవలె ….

అక్టోబర్ 8, 2007

చెప్పగవలె, కప్పురములు

కుప్పలుగ  పోసినట్లు, కుంకమపైపై

గుప్పిన క్రియ, విరి పొట్లము

విప్పిన గతి, ఘమ్మనం గవిత్వము సభలన్.  

                          — రఘునాధ నాయకుడి  వాల్మీకి చరిత్రము


శ్రీనాధ మహాకవి ….

అక్టోబర్ 8, 2007

బ్రాహ్మీదత్తవరప్రసాదుడ,ఉరుప్రజ్ఞావిశేషోదయా

జిహ్మస్వాంతుడ, వీశ్వరార్చనకళాశీలుండ, వభ్యర్హిత

బ్రహ్మాండాది మహాపురాణ చయ తాత్పర్యార్ధ నిర్ధారిత

బ్రహ్మజ్ఞాన కళా నిధానమవు, నీ భాగ్యంబు సామాన్యమే!

                         –  శృంగార నైషధము(శ్రీనాధ కవిసార్వభౌముడు)


gmail లో oops 7 & 8 errors

అక్టోబర్ 6, 2007

gmail లో తరచుగా మనకు attachments పంపేటపుడు ఈ error వస్తుంది. దీని వలన మనకు mail పంపడము కష్టమవుతుంది.    secured site వాడినట్టయితే మనకు mail పంపడము తేలికవుతుంది. క్రింది url మీద click చేసి తర్వాత దీనిని favourites కి add చేయండి.

https://mail.google.com/mail/  

ప్రతి సారి favourites  ద్వారా  gmail కి వెళ్లండి.


చూడు చూడు లోకం….

అక్టోబర్ 5, 2007

ఒక సారి ఈ లోకాన్ని చూడండి

ఈ లోకంలో జరిగే చిత్రాలు చూడండి

ఇక్కడ ఒళ్లమ్ముకొనే వేశ్యలుంటారు

అమ్ముడుపోయే వరుళ్ళు ఉంటారు

ఇక్కడ అర్ధరాత్రి వరకు త్రాగి తందనాలాడి

మధ్యాహ్నం ఏ పన్నెండింటికో

షూటింగుకు హాజరయ్యే

హీరో, హీరోయిన్లకు లక్షలకు లక్షలు

పారితోషికం లభిస్తుంది.

అయిదింటికే నిద్రలేచి

నిద్రలేమితోనే ఇంట్లో పనంతా చేసి

ఎనిమిదింటికే హడావిడి గా

పనిలోకెళ్ళే స్త్రీలకు

పాతిక రూపాయలు కూలి లభిస్తుంది.

ఇక్కడ తినడానికి తిండి లేని

నిర్భాగ్యులుంటారు

ఉండి తినలేని దౌర్భాగ్యులుంటారు

ఇక్కడ కారుల్లో తిరిగే

కుక్కలు కనిపిస్తాయి.

ఎంగిలి విస్తరాకుల మీద

ఎంగిలి మెతుకులు ఏరుకునే

పసి హృదయాలు కనిపిస్తాయి

ఇక్కడ మేధావి బిక్షమెత్తుకుంటాడు

మూర్ఖుడు కోట్లకు పడగలెత్తుతాడు

ఇక్కడ మనిషి దయ

దైవమై పూజలందుకొంటుంది

మనిషి మెదడు అణుబాంబుగా మారి

మొత్తం జీవకోటినే

భస్మీపటలం చేస్తుంది.

                   –  నబి-రఫి నిషిద్దాక్షరాలు (2003)

                         ప్రకాశం జిల్లా  రచయితల సంఘం


తెనుగే తీయని…

అక్టోబర్ 4, 2007

తెనుగే తీయని, దందు పద్య పదరీతి క్రీడ లత్యంత మో

హనముల్, శోభనముల్, తదీయ రస రక్తాలాపనంబుల్ లభిం

చిన, వాగర్ధ కలా కలాప జయలక్ష్మిన్ గాలికిం బుత్తునే?

జననీ! యేమిటి, కింక ఆశుకవితా సన్యాసమిప్పించవే!  

                                             –రాయప్రోలు సుబ్బారావు 


పలుకగ వలె…

అక్టోబర్ 4, 2007

కం//      పలుకఁగ వలె నవ రసములు

           గులుకం బద్యములు చెవులకున్ హృద్యముగా

           నళుకక, యటుగాకున్నం

           బలుకక యుండుటయే మేలు బహుమానముగన్.

                                                   — రఘునాధ రామాయణము


జయ జయప్రియ భారత…

అక్టోబర్ 4, 2007

జయ జయ ప్రియ భారత

జనయిత్రీ, దివ్యధాత్రి

జయ జయ జయ శత సహస్ర

నర నారీ హృదయనేత్రి

జయజయ సస్యామల సు

శ్యామ చలచ్చేలాంచల

జయ వసంత కుసుమలతా

చరిత లలిత చూర్ణకుంతల

జయ మదీయ హృదయాశయ

లాక్షారుణ పదయుగళా

                            //జయ జయ //

జయ దిశాంత గత వకుంత

దివ్యగాన పరితోషణ

జయ గాయక వైతాళిక

గళ విశాల పద విహరణ

జయ మదీయ మధురగేయ

చుంబిత సుందర చరణా

                                 // జయ జయ //

                                                             –  దేవులపల్లి కృష్ణ శాస్త్రి